అమరావతి : లడ్డూ ప్రసాదం(Laddu Prasadam) విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి తిరుమలను అపవిత్రం చేసి అబాసు పాలయ్యారని వైసీపీ అధికార ప్రతినిధి(YCP spokesperson) శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. లడ్డూ వ్యవహారంలో దేశ ప్రజలనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని విమర్శించారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.
లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు ( Chandrababu) వ్యాఖ్యలను ఆక్షేపించిందని పేర్కొన్నారు. తెలంగాణలో హైడ్రా మాదిరిగా ఏపీలో తిరుమల లడ్డూ అంశాన్ని బయటకు తీసుకొచ్చారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలం కావడంతో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి మార్చడానికి డైవర్షన్ రాజకీయాలు చేశారని ఆరోపించారు.
ఇటీవల రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల్లో కొవ్వొత్తులకు రూ. 26 కోట్లు, పులిహోరకు రూ. 360 కోట్లు ఖర్చు చేశామంటూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.