చంద్రబాబు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. సాధారణ వ్యక్తి మాదిరిగా కనిస్తుంటారు. ఒకే రకం దుస్తులను ధరిస్తుంటారు. అయితే, గురువారం నాటి సమావేశంలో చంద్రబాబు ధరించిన ఉంగరం అందరి దృష్టిని ఆకర్శించింది. ఎడమ చేయి చూపుడు వేలుకు హైటెక్ ఉంగరం కనిపించడంతో కార్యకర్తల్లో ఆసక్తి కలిగింది. చంద్రబాబు జ్యోతిషాలకు దూరంగా ఉంటారని టీడీపీ కార్యకర్తులు చెప్తుంటారు. అయితే, వయసు పెరిగే కొద్దీ జ్యోతిషాన్ని నమ్మి ఉంగరం ధరించారేమో నన్న అనుమానం వారిలోనూ వ్యక్తమైంది.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో మినీ మహనాడుకు చంద్రబాబు హాజరై కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సమయంలో ఎడమ చేతికి ధరించిన ప్రత్యేక ఉంగరాన్ని కార్యకర్తలు గమనించి చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా కొందరు ప్రస్తావించడంతో ఆ ఉంగరం ప్రత్యేకతను వారితో పంచుకున్నారు.
‘సార్! మీ వేలికి ఉంగరం ఎందుకు పెట్టుకున్నారు? గతంలో లేదు. జ్యోతిషుడు ఎవరైనా చెప్పారా’ అని చంద్రబాబు వద్ద ఆరా తీశారు. దాంతో ఉంగరం గురించిన సంగతులు వెల్లడించారు. ఈ ఉంగరంలో కంప్యూటర్తో అనుసంధానమైన చిప్ ఉన్నదని, ఈ ఉంగరం గుండె కొట్టుకునే తీరును, నిద్రిస్తున్న తీరును నమోదు చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఉంగరం నుంచి నమోదైన విషయాల ఆధారంగా మరుసటిరోజు సమీక్షించి లోపాలను సరిచేసుకోవచ్చునని చెప్పారు. ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరు ఆరోగ్యానికి సరైన ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.