అమరావతి : తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి తిరుపతిలోని (Tirupati) వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా మరో 48 మంది గాయపడ్డారు. ఘటనలో గాయపడ్డ క్షతగ్రాతులను పరామర్శించేందుకు గాను గురువారం విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో తిరుపతికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా తొక్కిసలాట ( Stampede ) జరిగిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వేలాది మంది టోకెన్ల కోసం వస్తారని తెలిసికూడా అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేదని ప్రశ్నించారు.
అధికారులకు బాధ్యతలు ఇస్తే వాటిని సక్రమంగా నెరవేర్చే బాధ్యత లేదా అంటూ టీటీడీ (TTD) ఈవో, కలెక్టర్, ఎస్పీలపై మండిపడ్డారు. ఎందుకు జరిగింది ఈ ఘటన అంటూ నిలదీశారు. తమాషాగా ఉందా? పద్దతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి అంటూ చురకలంటించారు.
క్యూలైన్ స్థలం వద్ద 2వేల మంది మాత్రమే ఉండేందుకు సరిపడ స్థలముంటే 2500 మంది ఎలా అనుమతిచ్చారని ,ఉదయం నుంచి టోకెన్లు జారీ చేస్తుండగా ఈ ఒక్క కేంద్రంలోనే రాత్రి ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారని అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈవో మాట్లాడుతూ భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందని, బయటకు వదిలేప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా సహాయ చర్యలు, అంబులెన్స్‌ల గురించి చంద్రబాబు ఆరా తీశారు.