Simhachalam Temple | ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరుగనున్నది. అదే రోజున అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న సింహగిరిపైనున్న ఆలయంలో తొలి గంధం అరదీతకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉదయం 6.30 గంటలకు చందనం అరగదీతకు అర్చకులు ముహూర్తం నిర్ణయించినట్లు ఈవో సుబ్బారావు పేర్కొన్నారు. ఈ రోజు భక్తులకు 7.30 గంటల తర్వాత స్వామివారి దర్శనాలు కల్పించనున్నట్లు వివరించారు.
చందనోత్సవం సందర్భంగా వైశాఖ శుద్ధ తదియ రోజున అప్పన్నస్వామి నిజరూప దర్శనం అనంతరం తొలి విడుతలో మూడు మణుగుల చందనం సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. మూడు మణుగులు అంటే దాదాపు 120 కిలోల చందనం సమర్పణ స్వామివారికి జరుగనున్నది. ఇందుకు ఆలయ సిబ్బంది బేడామండపంలో సానలపై చందనాన్ని అరగదీస్తారు. ఇలా సేకరించిన శ్రీగంధంలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి చందనోత్సవం రోజున అంటే ఈ నెల 30న రాత్రి సహస్ర ఘటాభిషేకం అనంతరం స్వామివారికి సమర్పిస్తారు.
వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా స్వామివారికి చందనం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది. శ్రావణ పౌర్ణమి రోజున కరాళ చందన అలంకరణతో కార్యక్రమం పరి సమాప్తమవుతుందని ఆలయ అధికారులు వివరించారు. స్వామివారి నిజరూప దర్శనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ క్రమంలో వస్త్రాలను కొనుగోలు చేసేందుకు రూ.20వేలు మంజూరు చేస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ రోజున ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించి.. స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సారి అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం 1.50లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. వేకువ జామున 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూ ఇవ్వాలని నిర్ణయించారు.