Mithun Reddy | వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సెక్యూరిటీని పెంచారు. ఆయనకు సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. తనపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు 4+4 సీఆర్పీఎఫ్ సిబ్బంది నిత్యం ఆయనకు భద్రతగా ఉండనున్నారు.
మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి పుంగనూరు కంచుకోటగా ఉంది. ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాజంపేట నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో పుంగనూరులో ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన పుంగనూరులోకి వస్తే చాలు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తాజాగా పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటించినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న భద్రత సరిపోదని సీఆర్పీఎఫ్ భద్రత కావాలని కేంద్ర హోం శాఖను మిథున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎంపీ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంశాఖ.. మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.