అమరావతి : కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలోని వైసీపీకి షాక్ ఇచ్చింది. వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు వస్తాయని భావించిన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు జారీ చేసి నోటిఫికేషన్‌ను (Notification ) కేంద్ర ఎన్నికల సంఘం రద్దు ( Central Election Commission ) చేసింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు ఈసీఐ వెల్లడించింది.
గతంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు (Indukuri Raghuraju) అనర్హడు అంటూ మండలి చైర్మన్ వేటు వేశారు. దీంతో రఘురాజు హైకోర్టులో సవాలు చేశారు. వాదోపవాదాలు విన్న తరువాత మండలి చైర్మన్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపడుతూ రఘురాజు అనర్హత వేటు చెల్లదని, ఆయన ఎమ్మెల్సీగా కొనసాగొచ్చని తీర్పునిచ్చింది. హైకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వుతో ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అసలు ఏం జరిగిందంటే ?
మొన్నటి ఎన్నికల్లో విజయనగరం జిల్లా ఎస్ కోట నియోజకవర్గ స్థానంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు వైసీపీ టికెట్ ఇవ్వొద్దని వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీ అధినేత జగన్‌ను కోరారు. అధిష్టానం శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైన రఘురాజు, తన కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి టీడీపీకి అనుకూలంగా పని చేసినట్లు వైసీపీ నేతలు మండలి చైర్మన్ మోషేన్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మోషేన్ రాజు రఘురాజుపై అనర్హత వేటు వేశారు. దీనిపై రఘురాజు హైకోర్టును ఆశ్రయించారు.