తిరుమల : మకర సంక్రాతి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేరోజు గోదాపరిణయోత్సవం ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుంచి శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్లి స్వామివారికి సమర్పిస్తారని అన్నారు. మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామి, శ్రీ కృష్ణస్వామి పార్వేట మండపానికి వేంచేస్తారని తెలిపారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీమలయప్ప స్వామి తిరుమలనంబి ఆలయానికి వేంచేసి మాడవీధుల్లో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారని వివరించారు. ఈ ఉత్సవాల కారణంగా ఈనెల 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.