AP News | మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకెళ్లాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి రాసిన ఈ లేఖలో లేళ్ల అప్పిరెడ్డి పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
జగన్ క్యాంపు కార్యాలయంలో వినియోగిస్తున్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే నాలుగు సార్లు లేఖలు రాశామని లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ ఏడాది జూన్ 15, జూన్ 19, జూలై 1, జూలై 29వ తేదీల్లో జీఏడీకి లేఖలు రాశామని వివరించారు. దీనిపై వైసీపీ తరఫున కార్యాలయ ఇన్‌ఛార్జి కూడా వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. అసలు ఆ ఫర్నీచర్‌ను తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
వైసీపీ, మాజీ సీఎం జగన్‌పై కేవలం నిందలు మోపడం కోసమే ఈ విషయంలో స్పందించడం లేదా? అని జీఏడీని లేళ్ల అప్పిరెడ్డి ప్రశ్నించారు. ఫర్నీచర్‌ను తీసుకెళ్లడం మీకు వీలుకాకపోతే.. ఎక్కడికి పంపించాలో చెబితే.. అక్కడికే పంపిస్తామని చెప్పారు. ఒకవేళ ఫర్నీచర్‌ను తీసుకోవడం ఇష్టం లేకపోతే.. వాటికి విలువ కట్టి చెబితే డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ఈ ఫర్నీచర్ కారణంగా కార్యాలయంలో స్థలభావం ఏర్పడిందని.. అందుకే సాధ్యమైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.