తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో జూలై 16న సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా ఆ రోజు బ్రేక్ దర్శనాలు(Break darshans) రద్దు చేస్తున్నట్లు టీటీడీ (TTD) అధికారులు తెలిపారు. ఈ కారణంగా జూలై 15న సిఫారసు లేఖలు స్వీకరించబడవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. తిరుపతి శ్రీనివాసమంగాపురం కల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి తీసుకువచ్చారు. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.