Srisailam | శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు సోమవారం అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టాపారాయణాలు, చండీహోమం, పంచాక్షరీ, భ్రామరీ, చతుర్వేద పారాయణాలు, కుమారి పూజలు జరిపించారు. భ్రామరీ అమ్మవారిని సింహమండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై బ్రహ్మచారిణి రూపంలో అలంకరించి విశేష అర్చనలు, పూజలు నిర్వహించారు.
అటుపై అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీభ్రామరాంబ మల్లికార్జునులు మయూరవాహనాన్ని అధిష్టించి భక్తులను కరుణించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరింపజేసి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. తరువాత గ్రామోత్సవంలో భాగంగా ఉత్సవ మూర్తులు మయూర వాహనంపై గంగాధర మండపం నుండి మొదులుకొని నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు విహరిస్తూ భక్తాదులను కరుణించారు.
గ్రామోత్సవంలో నాదస్వరం, మహిళా వీరగాని కన్నడ జానపద కళాప్రదర్శన, రాజభటుల వేషాలు, కేరళ వారి కథకళి వేషాలు, తప్పెట చిందు, లంబాడి నృత్యం, కాళికా నృత్యం, చెక్కభజన, కోలాటం, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లగ్రోవి, త్రిశూలం, జేగంట, కురవడోలు, కొమ్ము, నందికోలు సేవ తదితర విన్యాసాలతో ఆద్యంతం కనులపండువగా సాగింది.
ఉత్సవం తరువాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ, ఆదిదంపతులకు ఆస్థానసేవ జరిపించారు. ఈ కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, శ్రీశైలప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, ఎఈవోలు మోహన్, హరిదాసు, పర్యవేక్షకులు రవికుమార్, స్వాములు పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల్లో మూడవ రోజు మంగళవారం సాయంత్రం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో, స్వామివారు రావణ వాహన సేవలో దర్శనమివ్వనున్నారని ఈఓ పెద్దిరాజు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు స్వామి అమ్మవార్లకు చేస్తున్న గాత్ర నృత్య నివేదనల ప్రత్యక్ష ప్రసారాలను శ్రీశైల టీవీ ఛానల్, సోషల్ మీడియా ద్వారా వీక్షించవచ్చునని ఈవో తెలిపారు.