Srisaila Temple | శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం గురువారం సాయంత్రం వైభవంగా సాగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు సుమారు రెండు లక్షల మంది తరలివచ్చారు. భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు కల్యాణ మహోత్సవం తర్వాత… రథాన్ని అధిష్టించి.. క్షేత్ర పురవీధుల్లో విహరించడం ఆనవాయితీగా వస్తున్నది ఈవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం సాయంత్రం అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవాయిద్యాలు, ఢమరుక ధన్వులు.. అశేష జనవాహిని మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. అంతకు ముందు ఆలయం నుంచి రథం వరకు స్వామి అమ్మవార్ల ఉత్స విగ్రహాలను పల్లకీలో తోడుకొని వచ్చి.. ఆలయ సాంప్రదాయం ప్రకారం రథాంగపూజ, హోమం నిర్వహించారు.
రథాంగబలి కార్యక్రమంలో భాగంగా గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు సాత్వికబలి సమర్పించారు. రథోత్సవాన్ని వీక్షించడంతో సర్వపాపాలు కష్టాలు తొలిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. రథోత్సవాన్ని వీక్షించేందుకు రెండు రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు సుమారు రెండు లక్ష మంది వరకు తరలివచ్చారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామిఅమ్మవార్లకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవాన్ని నయనానందకరంగా జరిపించారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకపూజలందుకున్న స్వామిఅమ్మవార్లను ఆలయ పుష్కరిణి వద్దకు తోడ్కొనివచ్చి పుష్పాలంకరణ చేపట్టారు. ఆ తర్వాత తెప్పపైకి వేంచేపు చేయగా.. విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.