తిరుమల : అధికమాసం సందర్భంగా ఈ ఏడాది తిరుమల(Tirumala ) శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలను( Brahmotsavams) నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు , అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 2020లో అధికమాసం వచ్చిన నేపథ్యంలో కొవిడ్(Covid) కారణంగా రెండు బ్రహ్మోత్సవాలను టీటీడీ(TTD) ఏకాంతంగానే నిర్వహించింది. ఆ తర్వాత ఈ ఏడాది అధికమాసం రావడంతో రెండు బ్రహ్మోత్సవాలను భక్తుల మధ్య అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు.
రేపు ధర్మకర్తల మండలి సమావేశం
తిరుమలలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరుగనుంది. అన్నమయ్య భవనంలో జరిగే సమావేశానికి టీటీడీ పాలకవర్గం సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్ పనులు, కొనుగోళ్లు, భక్తులకు సౌకర్యాల కల్పన వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నామని అధికారులు వెల్లడించారు.