తిరుమల : తిరుమలలో బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి మలయప్పస్వామి పలు రకాల వాహనాలపై , వివిధ వేషాధారణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు బుధవారం సాయంత్రం మలయప్పస్వామి(Malayappaswamy) బంగారు రథం(Golden chariot)పై భక్తులను కటాక్షించారు. తిరు మాడవీధులలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ, భూదేవి కరుణతో సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసమని ఆలయ అర్చకులు వెల్లడించారు . ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీవారి గరుడ సేవ విజయవంతం.. భక్తులకు సంతృప్తికర దర్శనం: టీటీడీ ఈవో
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన(Garuda Seva) సేవను టీటీడీ అధికారుల
సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో ( TTD EO) జె.శ్యామల రావు అన్నారు. అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో కలిసి బుధవారం రాంభగిచా రెస్ట్ హౌస్ వద్ద టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ సేవలో ఆరోగ్యశాఖ (Health Department) సమర్దవంతంగా పని చేసిందని ప్రశంసించారు. మరుగుదొడ్ల విషయం మెరుగైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా మిగిలిన వాహన సేవలకు కూడా కష్టపడితేనే బ్రహ్మోత్సవాలు విజయవంతమవుతాయని
పేర్కొన్నారు.