తిరుపతి : వైఎస్ఆర్ జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు.
జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు జనవరి 21న అంకురార్పణ జరగనుందని తెలిపారు. ప్రధానంగా 26న గరుడవాహనం, 28న రథోత్సవం జరుగుతాయని వివరించారు. జనవరి 31న పుష్పయాగం జరుగనుందని చెప్పారు. టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు రథం పటిష్టతను పరిశీలించారని తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని తాళ్లపాక 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద రూ.50 లక్షలతో జరుగుతున్న శ్రీవారి నూతన ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
రూ.45 లక్షలతో చేపడుతున్న అన్నమయ్య విగ్రహం వద్ద నూతన వేదిక, రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పనులు, ఎలక్ట్రికల్, సివిల్ పనులు, భక్తులకు తాగునీటి సౌకర్యం, పుష్కరిణి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఆయన వెంట డిప్యూటీ ఈవో నటేష్ బాబు, వీజీవో మనోహర్, డీఈ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.