తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (Tiruchanur Brahmotsavam ) వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు బుధవారం అమ్మవారు గోవర్ధనగిరిధారియైన (Govardhanagiridhari) శ్రీ కృష్ణుని అలంకారంలో సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించారు.
ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ కొనసాగగా భక్తులు అడుగడుగునా నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం, ఐశ్వర్యం, సత్సంతానం, సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని అర్చకులు తెలిపారు.
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహనంపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, ఈవో శ్యామలరావు, జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, భక్తులు పాల్గొన్నారు.