Chandrababu | ఏపీలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు కలకలం సృష్టించాయి. తిరుపతిలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసాలలో బాంబులు పెట్టినట్లుగా బుధవారం నాడు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్ పేరుతో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆ మెయిల్లో ఉంది.
బాంబు బెదిరింపు మెయిల్స్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి దాన్ని అడుగడుగునా చెక్ చేస్తున్నారు. బాంబు బెదిరింపులతో నారావారిపల్లిలో చంద్రబాబు నివాసానికి పోలీసులు భద్రత పెంచారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ భవనాలతో పాటు నటి త్రిష ఇంటికి సైతం బాంబు బెదిరింపు కాల్స్ రావడం సంచలనం రేపింది. దీంతో తమిళనాడు పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్ అని తేల్చారు. అయినప్పటికీ చెన్నై అళ్వార్‌పేటలోని సీఎం స్టాలిన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.