అమరావతి : శ్రీశైలం నిత్యాన్నదాన సత్రంలో ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ స్ట్రీమింగ్ చేసే బాయిలర్ ఒక్కసారిగా పేలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. పేలుడుతో సిబ్బందికి భయాందోళనకు గురై అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. వేడి ఎక్కువ కావడంతో ఒత్తిడికి బాయిలర్ పేలినట్లు ప్రాథమికంగా గుర్తించారు. వేడినీళ్లు పడడంతో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ నిత్యాన్నదాన సత్రంలో రెండు సార్లు బాయిలర్ పేలిన ఘటనలు జరిగాయి.
కాగా ఈరోజు నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 21 వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజావరోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రేపటి నుంచి స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో తెలిపారు.
12న భృంగి వాహనసేవ, 13న హంస వాహనసేవ, 14న మయూర వాహనసేవ, 15న రావణ వాహనసేవ, 16న పుష్పపల్లకీ సేవ, 17న గజ వాహనసేవ, 18న మహాశివరాత్రి, ప్రభోత్సవం, నంది వాహనసేవను భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 19న రథోత్సవం, తెప్పోత్సవం, 20న యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, 21న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహిస్తామన్నారు.