విజయవాడ: ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి ప్రజలకు విషయం చేరవేసేందుకు బీజేపీ ఇవాల్టి నుంచి పోరా బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజయవాడ నుంచి తమ యాత్రను ప్రారంభించారు. ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కేంద్రం సాయంతో ఎలా రాష్ట్రాభివృద్ధికి పాల్పడుతున్నది వివరించేందుకు బీజేపీ సిద్ధమైంది.
బీజేపీ పోరు బాట యాత్రను ఏపీ బీజేపీ శాఖ చీఫ్ సోము వీర్రాజు ప్రారంభించారు. విజయవాడలోని సత్యనారాయణపురం శివాజీ కెఫె సెంటర్లో స్ట్రీట్ మీటింగ్తో యాత్ర మొదలైంది. ఇందు కోసం ప్రత్యేకంగా ఒక బస్సు, ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు. ఇవాల్టి నుంచి ప్రారంభమైన పోరు బాట యాత్ర తొలి దశ అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరుగనున్నది. దాదాపు 15 రోజులపాటు బీజేపీ ముఖ్యనాయకులంతా ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. 175 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 5 వేల బహిరంగ సభలు నిర్వహించనున్నది.
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దాదాపు 5 వేల బహిరంగసభలు నిర్వహించేందుకు బీజేపీ సన్నద్ధమవుతున్నది. ఏపీ రాజకీయాల్లో వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ యాత్ర లక్ష్యమని బీజేపీ నేతలు చెప్తున్నారు. కుటుంబ పార్టీ రాజకీయాల కారణంగా రాష్ట్రం నష్టపోతున్న విషయం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు వారు తెలిపారు.