AP Politics | వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని ఎటూ తేల్చడం లేదు. పొత్తులపై నిర్ణయాన్ని నానుస్తూనే.. ఒంటరిగా బరిలోకి దిగితే రిజల్ట్ ఎలా ఉండబోతుందనే దానిపై కూడా తర్జనభర్జనలు పడుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నఫళంగా ఢిల్లీ వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది.
నిజానికి దగ్గుబాటి పురంధేశ్వరి ఇవాళ నంద్యాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. నంద్యాలకు చెందిన బైరెడ్డి శబరి, ఆళ్లగడ్డ ఇన్‌ఛార్జి భూమా కిశోర్ రెడ్డి ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లి పరిస్థితులను సెట్ చేయాలని అనుకున్నారు. కానీ అకస్మాత్తుగా అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో చివరి నిమిషంలో నంద్యాల పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లారు. ఏపీ ఎన్నికల సన్నద్ధతతో పాటు, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించేందుకు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.
బీజేపీతో పొత్తు కొనసాగుతుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మొదట్నుంచి చెబుతున్నారు. కానీ బీజేపీ మాత్రం పొత్తులపై తమ నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. అధిష్ఠానానికే ఆ నిర్ణయాన్ని వదిలేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. అన్ని జిల్లాల ముఖ్య నేతలతో సమావేశమైంది. పార్టీ బలాబలాలతో పాటు.. వచ్చే ఎన్నికల బరిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై చర్చించింది. వీటి ఆధారంగా ఓ నివేదికను రూపొందించి అధిష్ఠానానికి సమర్పించారు. ఇదిలా ఉంటే.. త్వరలోనే బీజేపీ రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా? పొత్తు పెట్టుకోవాలా? అనే అంశంపై చర్చించేందుకు పురంధేశ్వరిని ఢిల్లీ పిలిపించినట్లు తెలుస్తోంది.
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లో టెన్షన్ మొదలయ్యింది. పొత్తులపై బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్.. రెండో విడత అభ్యర్థుల జాబితాతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించారని సమాచారం.