అమరావతి : ఏపీలో బీహార్ తరహ పాలన కొనసాగుతుందని వైసీపీ నాయకులు ( YCP Leaders ) ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బదులు లోకేష్ రాసిన రెడ్‌బుక్( Red Book ) రాజ్యాంగం నడుస్తుందని దుయ్యబట్టారు. ఏపీలోని కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం ఎంపీటీసీ ఎన్నికకు నామినేషన్‌ను వేసేందుకు వెళ్లిన దళిత మహిళ నుంచి నామినేషన్ల పత్రాలను బలవంతంగా తీసుకెళ్లాడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు శనివారం ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి ఫిర్యాదు చేశారు.
అనంతరం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు మీడియాతో మాట్లాడారు. రామకుప్పం ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం గురించి పదేపదే మాట్లాడే సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే దళిత మహిళ నామినేషన్‌ను అడ్డుకోవడం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతుందని అన్నారు.
స్టేషన్లో ఫిర్యాదు ఇస్తే తీసుకోవడం లేదని ఆరోపించారు. వైసీపీ డిజిటల్ లైబ్రరీ పెట్టామని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న వారి పేర్లు డిజిటల్ లైబ్రరీలో చేర్చుతున్నామని అధికార పార్టీకి అడుగులకు మడుగులొత్తే వారు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏడాది కాలంలోనే కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు.