అమరావతి: ఏపీ సీఎం జగన్ పాలకుడు కాదని, కక్ష్యదారుడని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) విమర్శించారు. జగన్ సీఎం (CM Jagan) అయ్యాక తినడం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి విపక్ష నేతలపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును (Chandrababu naidu) అక్రమంగా అరెస్టు చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆయన స్పందించారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నా.. చంద్రబాబుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్లు కక్ష్యసాధిస్తున్నారని మండిపడ్డారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ పెద్ద కుంభకోణమనేది ప్రచారం తప్ప.. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలనే రాజకీయ కక్ష్యతో చేస్తున్న కుట్ర అని దుయ్యబట్టారు. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగితే ఇప్పటివరకు ఎందుకు చార్జ్‌షీట్ చేయలేదని నిలదీశారు.