Ayesha Meera |విజయవాడలో 18 ఏండ్ల కిందట జరిగిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును పునర్విచారించిన సీబీఐ…. సత్యంబాబుపై పెట్టిన ఐపీసీ 376, 302 సెక్షన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19న విజయవాడలోని సీబీఐ కోర్టుకు హాజరై తెలపాలని ఆయేషా తల్లిదండ్రులు షంసాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు నోటీసులు పంపించింది. అయితే, ఈ కేసులో సీబీఐ నివేదిక వివరాలు తమకు ఇవ్వలేదని, కోర్టు విచారణకు హాజరు కాలేమంటూ ఆయేషా తల్లిదండ్రులు సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా తెనాలిలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం మాట్లాడుతూ.. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని తెలిపారు. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. మళ్లీ సత్యంబాబుపై కేసు పెట్టి తమను అభిప్రాయం అడగడమేంటని ప్రశ్నించారు.
కేసు విచారణ ముగిసిందని జూన్‌లోనే సీబీఐ సీల్డ్ కవర్లో నివేదికను హైకోర్టుకు ఇచ్చిందని షంషాద్ బేగం తెలిపారు. రిపోర్టు కాపీలను మాకు ఇవ్వకుండా కేసు గురించి అభిప్రాయం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నించారు. స్వయంప్రతిపత్తి సంస్థ అయిన సీబీఐ కూడా మా బిడ్డకు న్యాయం చేయలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మత సంప్రదాయాలను పక్కనబెట్టి ఆయేషా రీపోస్టుమార్టానికి సహకరించామని గుర్తుచేశారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని.. సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీ స్పందించాలని కోరారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని లేడీస్ హాస్టల్లో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా 2007 డిసెంబర్ 27వ తేదీన హత్యకు గురైంది. ఈ కేసులో 2008 ఆగస్టులో సత్యంబాబును అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. కాగా, సత్యంబాబుపై పెట్టిన కేసునను ఏపీ హైకోర్టు 2017 మార్చి 31వ తేదీన కొట్టివేసింది. అతడిని నిర్దోషి అని పేర్కొంటూ తీర్పునిచ్చింది. దీనిపై ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించగా.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. 2018లో రీఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన సీబీఐ.. మూడు నెలల క్రితం హైకోర్టుకు సమర్పించింది. నివేదికను తమకు ఇవ్వాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని కింది కోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో.. విజయవాడలోని సీబీఐ కోర్టులో వారు పిటిషన్ వేశారు. అయినప్పటికీ వారికి ఇంకా నివేదిక ఇవ్వలేదు.