విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొత్త వివాదం రాజుకున్నది. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నా వీసీ ప్రసాద్‌రెడ్డిని రికాల్ చేయలంటూ కొన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పక్షాలు గురువారం ఛలో ఏయూకు పిలుపునిచ్చాయి. వీరిని అడ్డుకునేందుకు వీసీ అనుకూల విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు శాంతియాత్ర, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుతున్నారు. రెండు వర్గాల పోటాపోటీ ఆందోళనలతో ఏయూలో అగ్గిరాజుకున్నది.
నిరసనలు, ఆందోళనలతో పతాక శీర్శికలకెక్కే ఆంధ్రా విశ్వవిద్యాలయం.. ప్రస్తుతం వైస్ ఛాన్స్లర్ రికాల్‌కు సంబంధించిన అంశంతో అట్టుడుకుతున్నది. యూనివర్శిటీలో అప్రజాస్వామిక విధానాలు అమలవుతున్నాయంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అసోసియేషన్ మార్చి 3 న చలో ఏయూకు పిలుపునివ్వగా.. ఏయూ పరిరక్షణ వేదిక పేరుతో మరికొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు దాన్ని అడ్డుకుని తీరుతామంటూ శపథం చేస్తున్నారు. దీంతో వర్శిటీలో తీవ్ర ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొన్నది.
యూనివర్శిటీ పరిధిలోని హెచ్ఆర్ఎల్ విభాగంలో రిటైర్ అయిన ప్రొఫెసర్ జాన్ గదిని ఖాళీ చేయించడంతో వీసీపై కొన్ని విద్యార్థి సంఘాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. ప్రసాద్‌రెడ్డిని వీసీ పదవి నుంచి తప్పిస్తేగానీ తమకు న్యాయం జరుగదని పలు విద్యార్థి సంఘాలు గురువారం చలో ఏయూకు పిలుపునిచ్చాయి. దీని కోసం అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే, యూనివర్శిటీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న వీరి చర్యలను అడ్డుకునేందుకు మరో వర్గం సిద్ధమైంది. రెండు వర్గాల పోటాపోటీ ఆందోళనలతో యూనివర్శిటీ క్యాంపస్ వేడెక్కింది. కాగా, ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్‌రెడ్డికి అధికార పార్టీ నుంచి ఆశీస్సులు మెండుగా ఉండటం విశేషం.