నెల్లూరు: ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. మైక్ సౌండ్లు, ప్రచారాలన్నీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగించాలి. మే 23న జరగనున్న ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ విధుల్లో 1300 మంది సిబ్బందిని నియమించనున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద 1000 మంది పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నారు.
గత ఫిబ్రవరి 21న సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆత్మకూరు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరుపున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. మరో 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ దూరంగా ఉండటంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల మధ్యే ఉండనున్నది. జూన్ 23న పోలింగ్, జూన్ 26న కౌంటింగ్ నిర్వహించి జూన్ 28లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నది.
సోమవారం సాయంత్రం నోడల్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఆయన కలెక్టర్ చక్రధర్బాబుతో సమావేశమయ్యారు. పోలింగ్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు.
దివ్యాంగుల కోసం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. 279 పోలింగ్ స్టేషన్లలో సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే సరి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. దొంగ ఓట్లు పడకుండా ఓటర్ల జాబితాలను పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించాలని ఎన్నికల అధికారి ఆదేశించారు. 123 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వాటి వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పాటు మైక్రో అబ్జర్వర్లను, వీడియో, వెబ్ కాస్టింగ్ లైవ్ తదితరాలను సిద్ధం చేశారు.