Ashok Gajapathiraju | ఆయనది రాజకుటుంబం! ఒకప్పుడు పౌరవిమానయాన శాఖ మంత్రిగానూ పనిచేశారు! ఆయన తలచుకుంటే ప్రత్యేక విమానంలో వెళ్లవచ్చు! కానీ ఆయన ఎలాంటి ఆర్భాటాలకు పోలేదు.. ఒక సామాన్యుడిలా రైలులో వెళ్లాడు! అంతేనా.. రైలు వచ్చేదాకా ప్లాట్‌ఫామ్‌పైనే ఎదురుచూశాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఒక దిమ్మెకు ఒరిగి తోటి ప్రయాణికులతో కూర్చున్నారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా? టీడీపీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజు. హైదరాబాద్ నుంచి తన సొంతూరు విజయనగరానికి ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి రైలులో వెళ్లారు. రాజవంశానికి చెందిన అశోక్ గజపతిరాజు సామాన్యుడిలా రైలులో ప్రయాణించిన విషయాన్ని టీడీపీ తన ట్విట్టర్(ఎక్స్) ద్వారా వెల్లడించింది.
స్వతహాగా రాజు అయిన అశోక్ గజపతి రాజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్లేందుకు సామాన్యుడిలా రైల్వే స్టేషన్లో ఎదురుచూశారని ట్విట్టర్లో టీడీపీ పేర్కొంది. నిజాయతీకి, పరిపూర్ణతకు ఆయన నిదర్శనమని అభివర్ణించింది. ఎల్లప్పుడూ ప్రజలకు ఏది ఉత్తమమని అనుకుంటారో.. అదే చేస్తుంటారని పేర్కొంది. అధికారం ఎప్పుడూ ఆయన్ను తప్పుదోవ పట్టించలేదని వ్యాఖ్యానించింది. దీంతో పాటు తన కుటుంబ సభ్యులతో కలిసి అశోక్ గజపతిరాజు నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తుండగా తీసిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోను టీడీపీ తన ట్విట్టర్లో పెట్టగా.. కాసేపటికే వైరల్‌గా మారింది.