తిరుమల : టీటీడీ ఆలయాలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాద ( Annaprasadam) వితరణ చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. అన్నప్రసాద వితరణకు ఇప్పటికే ఆలయ ఈవో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. అన్నప్రసాదం వితరణ, తయారీకి ధార్మిక సంస్థలు, మఠాలు ముందుకు వచ్చే వారితో అవగాహన చేసేందుకు చర్యలు తీసుకుంది . మొత్తం 60 టీటీడీ ఆలయాల్లో ( TTD Temples ) అన్నప్రసాదం పంపిణీకి త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలు అందించేందుకు 1985 ఏప్రిల్ 6న టీటీడీ ప్రారంభించింది. మొదట తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్‌లో అన్నదానం జరుగగా 2011 నుంచి తిరుమలలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం అందిస్తున్నారు. నవంబర్ 15 నాటికి రూ. 2,316 కోట్లు ఈ ట్రస్ట్ కు డిపాజిట్‌గా జమ అయ్యాయి.
ప్రస్తుతం తిరుమలలోని శ్రీ మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంతో పాటు, రాంబగీచ బస్టాండు, ఏఎంసీ, సీఆర్వో, పీఏసీ-1 వద్ద ఫుడ్ కౌంటర్లు, పీఏసీ – 2, పీఏసీ -4, పీఏసీ – 5 హాల్స్, వైకుంఠం క్యూకాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్మెంట్లు, నారాయణ గిరి షెడ్స్, బయటి క్యూ లైన్స్ లలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలో సాధారణ రోజుల్లో 1.80 లక్షల నుంచి 1.90 లక్షల మంది, వారాంతపు రోజులలో రోజుకు 2 లక్షల నుంచి 2.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు.
తిరుపతిలో..
తిరుచానూరులోని అన్నప్రసాద వితరణ కేంద్రం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలోని అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, శ్రీనివాసం, విష్ణునివాసం, ఆసుపత్రులు, ఒంటిమిట్టలోని శ్రీ కోందడరామ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరుగుతోంది.