అమరావతి : బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నట్లు తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి (Minister Kakani Goverdhan reddy) తిప్పికొట్టారు. మద్యం , డ్రగ్స్ ( Drugs) అలవాటున్నట్లు టీడీపీ నాయకుడు సోమిరెడ్డి(TDP Leader Somireddy) చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రేవ్ పార్టీలో తాను ఉన్నట్లు, డ్రగ్స్ తీసుకున్నట్లు, నాకు సంబంధించిన వాళ్లు పార్టీలో ఉన్నట్లు నిరూపించాలని డిమాండ్ చేశారు. బ్లడ్ శాంపిళ్లు ఇవ్వడానికి తాను సిద్ధమని, నువ్వు సిద్ధమేనా అని సవాలు విసిరారు.
రేవ్‌పార్టీలు నిర్వహించడం సోమిరెడ్డికి అలవాటని ఆరోపించారు. మూడోసారి నాపై ఓడిపోతున్నానన్న కసితో ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. రేవ్ పార్టీ విషయంలో ఎంతటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని, నువ్వు కూడా విచారణకు సిద్ధమా అంటూ నిలదీశారు.
ఇప్పటికే ఒకసారి తనకు సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రేవ్ పార్టీలో తన స్టిక్కర్‌తో దొరికిన కారు, పాసుపోర్టుపై విచారణ జరిపించాలని కర్ణాటక డీజీపీని కోరినట్లు కాకాణి స్పష్టం చేశారు. రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు.