AP Weather Alert | ఏపీకి అల్పపీడనం ముప్పు పొంచి ఉందని ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బిహార్ నుంచి ఒడిశా,ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు.
వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సోమవారం (11-05-26) నాడు మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30-50 కి. మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని ప్రఖర్ జైన్ సూచించారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు అల్లూరి జిల్లా జికే వీధి, పోలవరం జిల్లా గుర్తేడు మండలాల్లో తీవ్రవడగాలులు, అలాగే అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలంలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.