చిత్తూరు: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి-తిరుమల మధ్య సులువుగా రాకపోకలు కొనసాగించేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు.
బస్ టికెట్‌తోపాటు శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకున్నవారికి తిరుమలకు టికెట్లు జారీ చేయనున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. తిరుపతి బస్సులో సీటు బుక్ చేసుకునే సమయంలోనే తిరుమల రాకపోకలకు కలిపి టికెట్లు జారీ చేయనున్నారు. తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలకు టికెట్ తీసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుపతి వచ్చాక 72 గంటల పాటు ఈ టికెట్ చెల్లుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గురువారం నుంచే ఈ ఆఫర్ అందుబాటులో తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని.. తోటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు.