Group 2 | అభ్యర్థులు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా ఏపీపీఎస్సీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అంతేకాకుండా ఇవాళనే ప్రాథమిక కీని కూడా విడుదల చేసింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ https://portal-psc.ap.gov.in/లో గ్రూప్ 2 ప్రాథమిక కీని అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అభ్యంతరాలను తెలపవచ్చని తెలిపింది.
ఏపీలో అనేక పరిణామాల అనంతరం ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. రోస్టర్ అంశంపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి ఏపీ ప్రభుత్వం రెండు రోజుల కిందట లేఖ రాసింది. కానీ ప్రభుత్వం సిఫారసును ఏపీపీఎస్సీ సెక్రటరీ ఏ మాత్రం పట్టించుకోలేదు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలను నిర్వహించింది. దీంతో అనేక సందేహాల నడుమ అభ్యర్థులు ఇవాళ పరీక్షకు హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను నిర్వహించారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో 86,459 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 80వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. రోస్టర్‌కు వ్యతిరేకంగా గ్రూప్ 2 అభ్యర్థులు హైకోర్టులో వేసిన పిటిషన్ మార్చి 11న విచారణకు రానున్నది. ఈ నేపథ్యంలోనే కార్యాచరణపై దృష్టిపెట్టినట్లు అభ్యర్థులు చెబుతున్నారు.