AP Group 2 Mains | ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది.. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. ఆదివారం నాడు గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్క రోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 మెయిన్స్‌పై అభ్యర్థుల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొద్దిరోజుల పాటు పరీక్షలను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ మేరకు రేపటి నుంచి జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్‌ను ఏపీపీఎస్సీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్షల నిర్వహణపై అభ్యర్థులు కొద్దిరోజులుగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే నెల 11వ తేదీన విచారణకు రానుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫిడవేట్ వేసేందుకు ఇంకా సమయం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను కొద్దిరోజులు వాయిదా వేయడం మంచిదని ఏపీ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ సెక్రటరీకి లేఖ రాసింది.