హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సంబంధించిన వివరాలను జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్ రెడ్డి ఈ ఉదయం తన ఇంట్లోనే కుప్పకూలారు. దీంతో హుటాహుటిన ఆయన కుటుంబ సభ్యులు 7:45 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన స్పందించలేని స్థితిలో ఉన్నారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సయమానికి గౌతమ్ రెడ్డి శ్వాస కూడా తీసుకోవడం లేదు. కార్డియాలజిస్టులు, క్రిటికల్ కేర్ డాక్టర్లు కలిసి మంత్రికి 90 నిమిషాలకు పైగా సీపీఆర్ చేశారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. సోమవారం ఉదయం 9:16 గంటలకు కన్నుమూసినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు.
ఆపద సమయంలో కార్డియో పల్మోనరీ రిససిటేషన్-సీపీఆర్ చాలా కీలకం. గుండెను మళ్లీ బతికించే ప్రయత్నం చేయడమే సీపీఆర్. వివరంగా చెప్పాలంటే గుండె పనిచేయడం ఆగిపోవడంతో శరీర భాగాలకు నిలిచిపోయిన రక్త సరఫరాను తిరిగి పంపిణీ చేయడమే. ఇందుకోసం ఆపదలో ఉన్న వ్యక్తి ఛాతి మీద చేతులతో ఒత్తిడి కలిగించి గుండె కొట్టుకునేలా చేస్తారు.