అమరావతి : ఐదేండ్ల జగన్ విధ్వంస పాలనలో ఏపీ సర్వనాశనం అయ్యిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నారు. నాటి ఎన్నికల్లో బాబాయ్ వివేకా (Viveka) ను చంపారంటూ సానుభూతితో ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓటు వేయవద్దని అతని చెల్లెలు రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతున్నారని గుర్తు చేశారు. గొడ్డలి గుర్తు వైసీపీకి సరైనదని ఎద్దేవా చేశారు.
ఏపీలో వాలంటీర్ (Volunteers) వ్యవస్థను ఎట్టిపరిస్థితుల్లో రద్దు చేయబోమని, అధికారంలోకి రాగానే తిరిగి వ్యవస్థను కొనసాగిస్తామని పేర్కొన్నారు. పింఛన్లు (Pensions) పంపిణీకి నిధులు లేకపోవడంతో ఆ నెపం టీడీపీపై వేస్తున్నారని మండిపడ్డారు. పింఛన్లు పంపిణీకి సరిపడే ప్రభుత్వ ఉద్యోగులను నియమించి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్‌ను రూ.4వేలకు పెంచి అందజేస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని వెల్లడించారు.