అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి వెళ్లకూడదని ఇటీవలి పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. అయితే, పొలిట్ బ్యూరో అభిప్రాయాన్ని తోసిరాజని అసెంబ్లీకి వెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయించింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. సభకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరికొందరు అభిప్రాయపడటంతో అందరి సలహాలు, సూచనల మేరకు సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.
చంద్రబాబు కూడా దీనికి అంగీకరించారని, సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. అయితే, చంద్రబాబు మినహా మిగతా టీడీపీ సభ్యులందరూ హాజరవుతారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని సభలోనే ప్రశ్నించాలని భావిస్తున్నారు. అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆ అంశంపై చర్చ జరిగే అవకాశమున్నందున అసెంబ్లీకి వెళ్లడమే మంచిదని ఎమ్మెల్యేలు సూచించడంతో చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తున్నది.
అసెంబ్లీలో తన భార్యను దూషించడంతో విలపించిన చంద్రబాబు.. సీఎంగానే తిరిగి సభకు వస్తానని, అప్పటివరకు సభలో అడుగుపెట్టనని శపథం చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు బాటలోనే అసెంబ్లీ వెళ్లమని మెజార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ.. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబే సూచించినట్లు సమాచారం.