కేబినెట్ కూర్పు సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చిన సామాజిక న్యాయ విప్లవం ముందు ప్రతిపక్షాలు కొట్టుకుపోవాల్సిందేనని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ విప్లవం వల్ల వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓట్లు రావని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ కూర్పులో రాష్టంలోని అన్ని వర్గాలకూ సీఎం న్యాయం చేశారని, బలహీన వర్గాల చరిత్రలో అదో చెప్పుకోదగ్గ రోజు అని ఆయన అభివర్ణించారు.
సీఎం జగన్ ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేస్తానని స్పీకర్ ప్రకటించారు. తాను నాయకుడికి ఓ సమస్యగా మారుకూడదని, ఎక్కడ వుండమంటే అక్కడే వుంటానని స్పష్టం చేశారు. అగ్రకుల ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలను వెన్నుతట్టి లేపారని, జగన్మోహన రథ చక్రాల కింద ప్రతిపక్షం నలిగిపోవాల్సిందేనని అన్నారు. కేబినెట్ కూర్పు అనేది అంత ఈజీ కాదని, ఈ కూర్పు సీఎం విచక్షణాధికారం కిందే వుంటుందని స్పీకర్ పేర్కొన్నారు.