AB Venkateswara Rao | పూర్తి సంతృప్తితో పదవీ విరమణ చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ లోని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. సర్వీసులో పని చేసినన్ని రోజులూ నీతి నిజాయితీతో పని చేశానని చెప్పారు. శుక్రవారం ఉదయమే ఏపీ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా విధులు నిర్వహించారు. విజయవాడ ముత్యాలంపాడులోని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కార్యాలయంలో పదవీ విరమణ చేశారు. పోలీసుశాఖలో డీజీ హోదాలో ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.
పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వర రావుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, పలువురు అధికారులు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వృత్తి రీత్యా ఎంతో మందిని చూశానని, సమాజంలో మంచివాళ్లనూ చూశాను, దుర్మార్గులను చూశాననని చెప్పారు. తనకు వచ్చిన కష్టాలను చూసి ఎంతోమంది కంట తడి పెట్టారని అన్నారు.