హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుందని, బనకచర్ల ప్రాజెక్టు అమలైతే ఏపీ వాసులకు చంద్రబాబు దేవుడవుతాడని ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి లెక్కలు తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్తారని వైసీపీ అధినేత జగన్ అడుగుతున్నారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఈ మేరకు జవాబిచ్చారు.
రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ జగన్ సీమ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అందుకే బనకచర్లపై అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మిగులు, వరద జలాలు ఎక్కడున్నాయని జగన్ ప్రశ్నిస్తున్నారంటే.. రాష్ట్ర రైతులపై కక్షలాగానే తాము చూస్తామని చెప్పారు. బనకచర్లపై జగన్కు వందకు వంద శాతం అవగాహన లేదన్నారు.