Nimmala Ramanaidu | ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటి పారుదలశాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జలవనరులపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. కృష్ణా జలాలను ఆఖరి మైలు వరకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2026 జులై నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
పోలవరం ఎడమ కాల్వ జలాలు ఈ ఏడాది అనకాపల్లి వరకు తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నామని నిమ్మల తెలిపారు. ప్రాధాన్య క్రమంలో తొలి ఏడాది ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ప్రాధాన్యంగా చేపడతామని అన్నారు. 20-30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పూర్తికి సీఎం ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు లక్షయాలు నిర్దేశించుకుని నీటిపారుదల పనిచేస్తోందని అన్నారు.
రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ లేకపోతే నిరుపయోగంగా మారతాయని నిమ్మల అన్నారు. వైసీపీ పాలనలో ప్రాజెక్టుల నిర్వహణ సరిగ్గా లేదని విమర్శించారు. గత ప్రభుత్వం గ్రీజు కూడా పెట్టలేదని.. దీనివల్ల ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల నిర్వహణ కోసం తొలి ఏడాది మూడు విడతల్లో రూ.800 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామని అన్నారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా జలవనరుల శాఖకు నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల పేరు చెబితే టీడీపీ గుర్తుకొస్తుందని, వైసీపీ పేరు చెబితే ఇసుక, గనులు, మద్యం, భూమాఫియా గుర్తుకొస్తాయని ఎద్దేవా చేశారు.