AP News | ఏపీలో బాలికలపై అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో మరో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల మధ్యలో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు.. పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం పాపను అక్కడే వదిలేసి పారిపోయారు. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మధ్యలో నిద్రలేచిన తల్లిదండ్రులకు పాప కనిపించకపోవడంతో ఆ పరిసరాలు మొత్తం వెతికారు. ఇంతలో పామాయిల్ తోటలో ప్రాణాపాయ స్థితిలో పడివున్న బాలికను గుర్తించారు. వెంటనే బాలికను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్లుగా నిర్ధారించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
మంత్రి కొలుసు పార్థసారథి సీరియస్
బాలికపై అత్యాచర ఘటనపై ఏపీ గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా స్పందించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు జాగిలాలను రంగంలోకి దించాలన్నారు. అలాగే బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.