అమరావతి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravikumar) గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సెకీ (SECI) తో జగన్ చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి జరిగిందని అమెరికాలో కేసులు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల దస్త్రాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. సెకీతో ఒప్పందాల విషయంలో అధాని గ్రూప్‌పై(Adani Group) అమెరికాలో కేసులు నమోదు కావడం, అందులో అవినీతి జరగడంపై స్పందించారు.
2014-19 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా మార్చామని, జగన్ కారణంగా విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు. వైసీపీ హయాంలో పాత ఒప్పందాలు రద్దు చేసుకోవడం, ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకోవడంతో సమస్య వచ్చిందన్నారు. జరుగుతున్న పరిణామాలపై విద్యుత్ ఉన్నతాధికారులతో పాటు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించారు.