Gottipati Ravikumar | వినకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే ప్రభుత్వానికి ఆపాదిస్తారా అని మంత్రి గొట్టిరవికుమార్ మండిపడ్డారు. వైసీపీ దివాలాకోరు రాజకీయాలకు ఇదే నిదర్శనమని తెలిపారు. వివాదాన్ని ఇంకా రెచ్చగొట్టేందుకే వినుకొండలో జగన్ పర్యటిస్తున్నారని అన్నారు.
ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ వినుకొండకు బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదాన్ని ఇంకా రెచ్చగొట్టేందుకే వినుకొండలో జగన్ పర్యటిస్తున్నారని విమర్శించారు.
వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తారా అని గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. వైసీపీ దివాలాకోరు రాజకీయాలకు ఇదే నిదర్శనమని విమర్శించారు. హత్యా రాజకీయాలకు పేటెంట్ వైసీపీదే అని ఎద్దేవా చేశారు. 2014లో తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడని జగన్‌ను విమర్శించారు. 2019లో బాబాయ్‌ను చంపించి టీడీపీపై నెపం నెట్టి హత్యారాజకీయాలు చేసింది ఎవరో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ఎవరినైనా లేపేసే చరిత్ర వైసీపీ నేతలది అని మండిపడ్డారు.
నిందితులు ఎవరైనా కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనేలా వైఎస్ జగన్ కుట్రలు ఉన్నాయని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. చంద్రబాబు వద్ద జగన్ ఆటలు సాగవన్న విషయం తెలుసుకోవాలని హితవుపలికారు.