AP Mega DSC 2025 | ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను మెగా డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే జిల్లా కలెక్టరేట్, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లోనూ ఎంపిక జాబితాను ప్రదర్శనకు ఉంచింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం ఏప్రిల్ 20వ తేదీన ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం 5,77,675 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు విడుతల్లో ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం జూలై 5వ తేదీన ప్రిలిమినరీ కీ, ఆగస్టు 1వ తేదీన ఫైనల్ కీని అధికారులు విడుదల చేశారు. ఏడు విడతల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, తుది జాబితాను ప్రకటించారు. అయితే, 16,347 పోస్టులకు గానూ.. 15,941 పోస్టులను మాత్రమే అధికారులు భర్తీ చేశారు. ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 406 పోస్టులు భర్తీ చేయలేదని తెలిపారు.
మెగా డీఎస్సీలో ఎంపికైన వారికి ఈ నెల 19న నియామక పత్రాలు అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. తుది జాబితాలో ఎంపికైన వారిలో 49.9 శాతం మంది మహిళలే ఉన్నారు. అంటే.. ఎంపికైన వారిలో 7955 మంది మహిళలు, 7986 మంది పురుషులు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రుల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు.