AP News | ఏపీలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ సెక్రటరీ చిన్నరాముడు కుమార్తె మాధురి సాహితీ బాయి (27) ఆత్మహత్య చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న 8 నెలల్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. చిన్న రాముడు కుమార్తె మాధురి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన రాజేశ్ నాయుడు అనే యువకుడితో ప్రేమలో పడింది. రాజేశ్ నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం బుగ్గనపల్లి తండాకు చెందిన అతను. వీరి ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి చిన్న రాముడు ఒప్పుకోలేదు. దీంతో ఎనిమిది నెలల క్రితం మాధురి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఈ ఏడాది మార్చిలో రాజేశ్ నాయుడిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన మూడు నెలల వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత వేధింపులు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో రెండు నెలల క్రితం మాధురి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తన గదిలోని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాధురి మరణం గురించి తెలియగానే పోలీసులు వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. తల్లి లక్ష్మీబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తన కుమార్తె మరణంపై ఐఏఎస్ చిన్న రాముడు మీడియాతో మాట్లాడుతూ.. తన కుమార్తెను రాజేశ్ నాయుడు మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని తెలిపారు. తనకు ఉద్యోగం ఉందని చెప్పి, మహానందిలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆ విషయం తెలిసిన తర్వాత పెద్దల సమక్షంలో గ్రాండ్‌గా మళ్లీ పెళ్లి చేస్తానని చెప్పి అల్లుడితో తన కుమార్తెను పంపానని చెప్పారు. కానీ ఆ తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీకు నేనే దిక్కు.. నేను చెప్పిన మాట వినకపోతే చంపేస్తా’ అని తన కుమార్తెను రాజేశ్ బెదిరించేవాడని అన్నారు. కనీసం తమకు ఫోన్ చేయాలన్నా రాజేశ్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేదని తెలిపారు. దీంతో అక్కడ ఉండలేనని మాధురి చెప్పడంతో.. రెండు నెలల కిందట తాడేపల్లి నవోదయ కాలనీలోని తన నివాసానికి తీసుకొచ్చానని పేర్కొన్నారు. రాజేశ్‌ది నిజమైన ప్రేమ కాదని.. డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నాడని.. అందుకే నన్ను తీసుకెళ్లడానికి వస్తలేడని మాధురి బాధపడేదని తెలిపారు. తన కూతురు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే మాధురి ఆత్మహత్యపై ఆమె భర్త రాజేశ్ కూడా అనుమానం వ్యక్తం చేశారు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమెను కుటుంబసభ్యులే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. తమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో మూడు నెలల క్రితం వారు మాధురిని బలవంతంగా తీసుకెళ్లారని తెలిపారు. వేరే పెళ్లి చేసేందుకు ఆమెను బలవంతపెట్టారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని మాధురి తనకు మెసెజ్‌ల రూపంలో చెప్పిందని చెప్పారు. మాధురిని వేరే పెళ్లి చేసుకోవాలని మానసికంగా వేధించి, చివరకు ఆమె ప్రాణం తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాధురి ప్రస్తుతం గర్భవని అని.. ఆమెది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యే అని అనుమానం వ్యక్తం చేశారు. తన భార్య మృతదేహం తనకు అప్పగిస్తే తానే అంత్యక్రియలు చేసుకుంటానని.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నంద్యాల ఎస్పీకి రాజేశ్ నాయుడు వినతి పత్రం అందజేశారు.