Vangalapudi Anitha | భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని, డీజీపీని నివేదిక కోరడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి శాఖలో పవన్ కల్యాణ్ తలదూర్చడమేంటని చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలిస్తే తప్పేంటని ప్రశ్నించారు.
భీమవరం పోలీస్ సబ్ డివిజన్లో డీఎస్పీ జయసూర్య ప్రవర్తనపై పలు ఫిర్యాదులు రావడంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ స్వయంగా ఆరా తీశారు. దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. డీఎస్పీ పేకాట శిబిరాలు ప్రోత్సహించడంతో పాటు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని డీజీపీని కోరారు. పవన్ కల్యాణ్ జోక్యంతో ఇది రాజకీయ దుమారం లేపింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ.. మంత్రుల మధ్య సమన్వయం ఉంటే మీకు ఎందుకు బాధ అవుతుందని ప్రశ్నించారు. ఇతర శాఖల అంశాలు నా దృష్టికి వస్తే నేను సంబంధిత మంత్రికి తెలుపుతాను.. అలాగే పవన్ కల్యాణ్ కూడా డీఎస్పీ వ్యవహారాన్ని నా దృష్టికి తీసుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంలో ప్రతి శాఖ పరస్పర సహకారంతో పనిచేయాలని అన్నారు.
మంత్రులు తమ పరిధిలోని సమస్యలను గుర్తించి, తగిన విధంగ సూచనలు ఇవ్వడం తప్పు కాదని వంగలపూడి అనిత తెలిపారు. ప్రజల ఫిర్యాదులపై స్పందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. మంత్రులమంతా సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు. దీనిని రాజకీయం చేయడం సరికాదని హితవు పలికారు. తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని వంగలపూడి అనిత తెలిపారు. డీఎస్పీ జయసూర్యకు సంబంధించిన నివేదిక ఉందని.. తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యపై కూడా హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. దురదృష్టవశాత్తూ జరిగిన ఘటనల్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలనుకునేవారు.. దానిని ముందుకు తీసుకెళ్లలేరని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదని అన్నారు. ఈ ఘటన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగిందే అని స్పష్టం చేశారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని సీఎం కోరుకున్నారని తెలిపారు.