AP Governor | ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి రావడంతో ఇవాళ తెల్లవారుజామున ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శుక్రవారం రాత్రి బెంగళూర్ నుంచి హైదరాబాద్కు రావాల్సి ఉంది. కానీ విమానం ఆలస్యం కావడంతో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయన్నను తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని గుర్తించారు. దీంతో శస్త్ర చికిత్స వాటిని తొలగించాలని వైద్యులు సూచించారు. అయితే ఇవాళ ముఖ్యమైన పనులు ఉండటంతో.. ఆపరేషన్ కోసం మరోసారి వస్తానని గవర్నర్ చెప్పినట్లు సమాచారం. కాగా, చికిత్స అనంతరం పరిస్థితి నిలకడగా ఉండటంతో మణిపాల్ ఆస్పత్రి నుంచి విజయవాడలోని తన నివాసానికి గవర్నర్ బయల్దేరి వెళ్లారు.