(GO Number 2) అమరావతి: ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో మరోసారి ఏపీ సర్కార్ వెనకడుగు వేసింది. జీఓ నంబర్ 2 ను ఏపీ ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ మేరకు కోర్టుకు విన్నవించింది. జీవో నంబర్ 2 ను వెనక్కి తీసుకోవడంపై రాష్ట్రంలోని సర్పంచ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 2 ను తీసుకొచ్చింది. ఈ ఉత్తర్వులపై పలువురు సర్పంచ్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి జీవో నంబర్ 2 ను సస్పెండ్ చేయాలంటూ సర్పంచ్లు తమ పిటిషన్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వు పంచాయతీరాజ్ చట్టానికి పూర్తిగా విరుద్ధమని సర్పంచ్లు కోర్టులో వాదించారు. దీని ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి దాపురిస్తుందని స్పష్టం చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేయాలని ఈ నెల 20 కి విచారణను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వివాదాస్పద జీవో నంబర్ 2 ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్లీడర్ కోర్టుకు తెలియజేశారు.