అమరావతి: ఏపీప్రభుత్వ, ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లి వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఐటీడీపీ సభ్యులతో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. అవాస్తవాల చెప్పి ఏపీ సీఎం జగన్ ప్రజలను మోసం చేశారని, ఏపీలోని యువకులు, మహిళలు, మేధావులు ప్రజలకు వాస్తవాలు చెప్పి ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.
వైఎస్ వివేకాను గొడ్డలిపోటుతో చంపి గుండెపోటుగా చిత్రికరించేందుకు ప్రయత్నించారని, ఆ నేరాన్ని టీడీపీపై మోపారని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందున సీబీఐపై ఎదురుదాడి చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నిజాలను వెలికితీయడంలో ఐటీడీపీ( ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టీడీపీ) కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు.
చేతకానివాళ్లు కుల, మత, ప్రాంతాల గురించి మాట్లాడతారని ఆరోపించారు. తెలుగువారే నా కులం, మతమని, తెలుగువారంతా నా కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.