అమరావతి: అంతర్జాతీయంగా పేరుగడించి ‘అమూల్’ సంస్థ ద్వారా ఏపీలో తయారు చేసిన పాలు, బాలామృతాన్ని రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.
రాష్ట్రంలోని స్థానిక డెయిరీల నుంచి ఉత్పత్తయ్యే తాజా పాలతో పాటు రాష్ట్రంలోనే ప్రాసెస్ చేసిన బాలామృతాన్ని అంగన్వాడీ కేంద్రాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఇక్కడి పాడి రైతులకు మేలు జరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అనే మరో మంచి కార్యక్రమానికి ఇవాల్టి నుంచి శ్రీకారం చుడుతున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే ప్రకాశం, కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతున్నదని తెలిపారు. పాడి రైతుకు రూ.5 నుంచి రూ. 20 అదనపు ఆదాయం వస్తుందని, రాష్ట్రంలో ప్రభుత్వం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. అమూల్ తర్వాత ప్రైవేట్ కంపెనీలు రేట్లు పెంచాల్సి వచ్చిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. పాల సేకరణలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.