అమరావతి: విశాఖపట్నంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్శించేలా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నమని సీఎంకు తెలిపారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లుపై చర్చించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి ప్రణాళిలను ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో పారదర్శకంగా పారిశ్రామిక విధానాలు ఉన్నందునే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎందరో పారిశ్రామికవేత్తలు అడుగులు వేస్తున్నారని సీఎం జగన్ ఈ సందర్భంగా చెప్పారు.
రాష్ట్రంలో 28,247 ఎంఎస్ఎంఈలు కాకుండా 96 భారీ పారిశ్రామిక యూనిట్లు తమ కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల గత మూడేండ్లలో గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధి జరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రూ.1,51,372 కోట్ల పెట్టుబడితో దాదాపు 61 యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని, 1,77,147 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే, మరో ఐదు యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 92 పరిశ్రమలు రాష్ట్రంలో రూ.2,19.766 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా 3,19,829 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ-చెన్నై కారిడార్లో నక్కపల్లి నోడ్, కాళహస్తి నోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు వివరించారు.
ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల స్పెషల్ సీఎస్ కరికల్ వలవెన్, పరిశ్రమల డైరెక్టర్ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జే సుబ్రహ్మణ్యం, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ కే వెంకట్ రెడ్డి, ఏపీటీపీసీ చైర్మన్ కే రవిచంద్రారెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈవో షణ్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.