GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే పదవుల నుంచి వైదొలగుతున్నానని జీవీ రెడ్డి తెలిపారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతానని చెప్పారు.
నిజానికి కొంతకాలంగా ఫైబర్‌నెట్ ఎండీ జీవీ రెడ్డిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జీవీ రెడ్డి రాజీనామా చేయడంతో పాటు.. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించడం సంచలనంగా మారింది.
Fibernet Chairman GV Reddy Resignation Letter
అసలు వివాదమేంటి?
ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్లో వైసీపీ హయాంలో పలు అక్రమాలు జరిగాయని జీవీ రెడ్డి కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ తనకు సహకరించడం లేదని, ఇప్పటికీ ఆయన వైసీపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ దినేశ్‌కుమార్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను అడిగిన రికార్డులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సంస్థకు చైర్మన్‌గా ఉంటూ జీవీ రెడ్డి ఇలా మీడియా ముందు సంస్థ వివరాలన్నీ బయటపెట్టేసి.. సంస్థను వివాదంలోకి లాగడంతో ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జీవీ రెడ్డికి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఈ విషయాన్ని సద్దుమణిగేలా చూడాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆదేశించారు.
సీఎం చంద్రబాబు ఆదేశాలతో శుక్రవారం నాడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా జీవీ రెడ్డి తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంస్థకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని గానీ.. మీడియాకు ఎక్కుతారా అని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని దినేశ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా కల్పించుకున్న జీవీ రెడ్డి.. తాను కూడా రెండు రోజుల్లో ఓ నివేదిక ఇస్తానని చెప్పారు. ఇలాంటి తరుణంలో చైర్మన్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి జీవీ రెడ్డి రాజీనామా చేయడం హాట్ టాపిక్‌గా మారింది.